అమరావతి : ఏపీలో సంపదను సృష్టించి పేదవారికి పంచిపెడుతామని కూటమి ఇచ్చిన హామీపై వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. ఆరునెలల క్రితం చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టి సంపద బదులు అప్పులు మాత్రం సృష్టిస్తున్నారని ట్విటర్లో వైసీపీ ( YCP Twitter ) ఆరోపించింది. ప్రతివారం అప్పు తెస్తే తప్ప పూట గడవని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని మండిపడింది.
ఎడా పెడా అప్పులు చేస్తూ డబ్బును తమకు లాభం కలిగించే పనులకోసం మళ్లిస్తున్నారని, బాబును నమ్మి మోసంపోవడం ప్రజలకు ఇది నాలుగోసారని ఎద్దేవా చేసింది. అన్ని పథకాలనూ మింగేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ కొండ చిలువలా సైలెంట్ గా ఉంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు కోట్లకు పడగలెత్తి ప్రజలను రోడ్డున పడేశారని ఆరోపించారు. ఆరు నెలలు గడిచిపోయాయి. సూపర్ సిక్స్ లో ఏ పథకం జాడలేదని వైసీపీ విమర్శించింది.
విద్యాసంస్కరణల పేరుతో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను దూరం చేస్తుందని మండిపడింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఎత్తేస్తూ తెలుగు మీడియంలోనే బోధన కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించడం పేద పిల్లల పాలిట అశనిపాతంలా మారిందని వైసీపీ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం వల్ల ఇక డబ్బున్నోళ్లకే వైద్య విద్య అందుతుందని, పేదింటి బిడ్డలు డాక్టర్లు కాకుండా కుట్ర చేస్తుందని ఆరోపించింది.