తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరిలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ ప్రకటించింది.ఫిబ్రవరి 1న భీష్మ ఏకాదశి, 5న రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 7న తిరుమొళిశైయాళ్వార్ వర్షతిరునక్షత్రం, 10న కూరత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, 16న సర్వ ఏకాదశిని 18న గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవంగా జరుపుతున్నామని తెలిపారు. భక్తులు విశేష ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ ప్రతినెలా హోమాలు నిర్వహిస్తామని టీటీడీ ధర్మకర్తల మండల అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. దేశ, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, కరోనా లాంటి మహమ్మారి ఇకపై రాకుండా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఆరు రోజుల పాటు విశ్వశాంతి హోమం నిర్వహించినట్టు తెలిపారు.
ఇందులో భాగంగా గణపతి హోమం,సుబ్రమణ్యస్వామివారి హోమం, శ్రీ దుర్గ, శ్రీ లక్ష్మీ, శ్రీ సరస్వతి అమ్మవార్ల హోమం, నవగ్రహ హోమం,దక్షిణామూర్తి స్వామివారి హోమం, రుద్ర, మృత్యుంజయ స్వామి వారి హోమాలు నిర్వహించినట్టు తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో యాగాల నిర్వహణకు శాశ్వతంగా యాగశాల ఏర్పాటు చేశామని, ఇకపై ప్రతినెలా అక్కడ యాగాలు నిర్వహిస్తామని వివరించారు.