తిరుమల : తిరుమల ( Tirumala ) శ్రీవారి ఆలయంలో మే నెలలో ( May Month ) జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. మే 1న అనంతాళ్వార్ ఉత్సవం ప్రారంభమవుతుందని వివరించారు. మే 2న భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి, 6న శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు.
8న పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు సమాప్తి, 10న అనంతాళ్వార్ శాత్తుమొర, 11న నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతిని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 12న కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి, పౌర్ణమి గరుడ సేవ, 14న పరాశర భట్టర్ వర్ష తిరు నక్షత్రం, 22న హనుమజ్జయంతి, 31న నమ్మాళ్వార్ ఉత్సవం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు కలిగిన భక్తులు నేరుగా స్వామివారి దర్శనం అవుతుందని ఆలయ అధికారులు వివరించారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం అవుతుందని తెలిపారు. కాగా నిన్న స్వామివారిని 78,177 మంది భక్తులు దర్శించుకోగా 23,694 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 3.53 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.