అమరావతి : ఆంధ్రప్రదేశ్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం(TDP) అభ్యర్థుల రెండో జాబితాను రేపు విడుదల చేయనున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu) ప్రకటించారు. వీలైనంతమంది టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. అభ్యర్థుల కసరత్తు తుదిదశకు చేరుకుందని పేర్కొన్నారు. జనసేన, బీజేపీ ఏఏ స్థానాల్లో పోటీ చేసేది వారికి స్పష్టత ఉందని వివరించారు.
సమయానుకూలంగా ఆ పార్టీలు వారి అభ్యర్థుల్ని ప్రకటిస్తాయని అన్నారు. కాగా ఏపీలో175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 144, బీజేపీ(BJP) 10, జనసేన(Janasena) 21 స్థానాల్లో పొత్తులు ఖరారయ్యాయి. అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలకు టీడీపీ 17, జనసేన 2, బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేయడానికి పొత్తులు కుదిరాయి. వీటికి ఇప్పటికే టీడీపీ 94 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా జనసేన 5 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీ ఇంకా అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో అభ్యర్థుల జాబితాను తయారు చేస్తున్నారు.