అమరావతి : విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేంద్రం వాల్తేరు డివిజన్‌ను రద్దు చేయడం పట్ల విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి విశాఖ ప్రజలను మోసం చేసేందుకు వాల్తేరు రైల్వే డివిజన్‌ను రద్దు చేసి రాయగడ్ కేంద్రంగా కొత్త డివిజన్‌ను ప్రకటించడ పట్ల రైల్వే జోన్ పోరాట సాధన సమితి నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు విశాఖలో సీపీఎం నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు.
మోదీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలకు ద్రోహం చేస్తుందన్నారు. ఒడిస్సాలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వాల్తేరును డివిజన్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని ఏ హామీని నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను ద్రోహం చేస్తున్న కేంద్రం విశాఖ జోన్‌ను ఇచ్చి జోన్లో అత్యంత ఆదాయ వనరుగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి రాయగడ్ కేంద్రంగా డివిజన్‌ను ఏర్పాటు చేయడం దారుణమని అన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ ప్రజలకు నష్టపరుస్తున్న విధంగానే రైల్వేను కూడా ప్రైవేట్‌పరం చేసేందుకు ప్రయత్నిస్తుందని సాధన సమితి నాయకులు ఆరోపించారు.