అమరావతి : విజయవాడలోని ఇంద్రకీలాద్రి (Indrakiladri ) దుర్గ మల్లేశ్వరస్వామి దేవస్థానానికి భారీగా ఆదాయం( Income) సమకూరింది. గత 15 రోజుల్లో అమ్మవారి హుండీకి కానుకల రూపేణా రూ. 2.63 కోట్లు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వివరించారు. 380 గ్రాముల బంగారం, 5,540 కిలోల వెండి వస్తువులను మొక్కుల రూపంలో హుండీ (Hundi) లో వేశారని తెలిపారు.
వీటితో పాటు 281 యూఎస్ ఏ డాలర్లు (USA Dollars) , 70 ఆస్ట్రేలియా డాలర్లు, 20 ఇంగ్లాండ్ పౌండ్లు, 401 రియాల్స్, 110 యూరోలు, 10 సింగాపూర్ డాలర్లు, 5 కెనడా డాలర్లు వేశారని తెలిపారు. మరికొంత మంది భక్తులు ఈ-హుండీ ద్వారా రూ౦. 54,228 లు వేశారని ఈవో రామారావు వెల్లడించారు. మూడు రోజుల పాటు నిర్వహించిన శాకాంబరి ఉత్సవాలకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆయన పేర్కొన్నారు.
I