భద్రాచలం, ఏప్రిల్ 9 : రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనం చేసిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలుపాలని, ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని హరిత హోటల్లో రాజకీయ అఖిలపక్షం, ఉద్యోగ సంఘం, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో విలీనమైన ఐదు గ్రామపంచాయతీలతో భద్రాచలం పట్టణానికి సాంకేతిక ఇబ్బందులతోపాటు సరిహద్దు సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. పురుషోత్తపట్నం, ఎటపాక, కన్నాయిగూడెం, పిచికలపాడు, గుం డాల గ్రామ పంచాయతీల సాధన డిమాం డ్ భద్రాచలం నుంచి ఢిల్లీలోని పార్లమెంటుకు చేరేవరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఈ నెల 13న నిర్వహించే అఖిలపక్ష భేటీకి ఉద్యోగ సంఘా లు, రాజకీయ పార్టీలు, సకల జనులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జేఏసీ నాయకులు అమరుని రామారావు, వెంకటపుల్లయ్య, చల్లగుండ నాగేశ్వరరావు, మోదుగు వేలాద్రి పాల్గొన్నారు.