అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలన ( Coalition government) దారుణంగా ఉందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (YS Jagan ) ఆరోపించారు. రాష్ట్రంలో మొంథా తుపాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలు, బాధితులను ఆదుకోవడంలో వైసీపీ శ్రేణుల పాత్ర వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్ జగన్ వివరించారు.
తుపాన్ వల్ల నష్టపోయిన బాధితులకు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పైరు పొట్టదశలో ఉన్నప్పుడు తుపానుతో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. దాదాపు రాష్ట్రంలో 25 జిల్లాలో15 లక్షల ఎకరాల్లో 11 లక్షల ఎకరాలో్ల వరి పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. 1.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.14 లక్షల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లిందని వెల్లడించారు.
వైసీపీ హాయంలో నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాలు విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచాయని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. ఉచిత పంటల బీమాను 83 లక్షల మందికి గాను కూటమి కేవలం 19 లక్షల మందికి మాత్రమే బీమాకు ప్రీమియం చెల్లించిందని ఆరోపించారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రీమియం కట్టి 54.55 లక్షల మంది రైతులకు రూ.7,800 కోట్లు బీమాను ఇప్పించగలిగామని జగన్ అన్నారు. కూటమి 16 నెలల పాలనలో 16 తుపాన్లు . అల్పపీడనలు, వాయుగుండాలు ఏర్పడగా నష్టపోయిన రైతులను ఆదుకున్నది శూన్యమేనని విమర్శించారు.