అమరావతి : ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ( MLC Varudu Kalyani) ఆరోపించారు. బుధవారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె కూటమి ప్రభుత్వం వైఫల్యాలను వివరించారు. 2025లో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందని విమర్శించారు.
చిన్నారులు, మహిళలు, యువతులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. బెల్టు షాపులు, మద్యం దుకాణాలను విచ్చలవిడిగా నెలకొల్పి ప్రజల జీవితాలతో చెలగాటమాడాయని పేర్కొన్నారు. డీజీపీ విడుదల చేసిన వార్షిక నివేదికలో నేరాల సంఖ్య పెరిగిపోయాయని వెల్లడించడం ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ పనితీరును తెలియజేస్తుందని వెల్లడించారు.
గంజాయి, డ్రగ్స్ కేసులు, హత్యలు, లైంగిక దాడులు సైతం దారుణంగా పెరిగాయని వివరించారు. సామాన్య మహిళలే కాకుండా దేవతలకు అవమానం చేశారని మండిపడ్డారు. దుర్గమ్మ ఆలయానికి కరెంటు కట్ చేశారని ఆరోపించారు. మహిళా మంత్రులు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నా గాని చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు.