అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగ పోస్టుల భర్తీ, సహా పదవీ విరమణ వయస్సును 60కి తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చలో కలెక్టరేట్ల కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. . రాష్ట్రవ్యాప్తంగా పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ, టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత, పీవైఎల్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. చిత్తూరు, విజయనగరం, విజయవాడ, కడప తదితర ప్రాంతాల్లో విద్యార్థి, యువజన సంఘం నాయకులను అరెస్టు చేశారు.
విజయనగరంలో ఉద్యోగ సాధన సమితి ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్‌ను నిర్వహించారు. మూడు లాంతర్ల నుంచి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను నిరసనలకు అనుమతించ వద్దని కళాశాలల యాజమాన్యాలకు పోలీసులు ముందస్తు నోటీసులు అందజేశారు.
ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగాలను వైసీపీ ప్రభుత్వం భర్తీ చేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని, రాష్ట్రంలో వేలాదిగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్రంలో పదవి విరమణ వయస్సును 62కు పెంచడం వల్ల నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.