అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ( Amaravati ) లో ఉద్రిక్త ( Tension ) పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నాయకులు శనివారం అమరావతిలో పర్యటన ఖరారు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఉండవల్లి రైతులు వైసీపీ నాయకులను అడ్డుకున్నారు. రాజధాని ( Capital )అమరావతిని గుర్తించని వైసీపీ నాయకులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
మూడు రాజధానుల పేరిట ముప్పుతిప్పలు పెట్టిన వైసీపీకి అమరావతిలో పర్యటించే అర్హత లేదంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలతో రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఒకరినొకరు తోసుకోవడంతో ఘర్షణ ఏర్పడింది. రాళ్లు రువ్వుకోవడంతో కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. రాజధానిగా అమరావతిని గుర్తించాకే పర్యటించాలని డిమాండ్ చేశారు. తుళ్లూరు డీఎస్పీ నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పెనుమాక, కృష్ణయపాలం రైతులు సైతం వైసీపీకి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు.