అమరావతి: ఉక్రెయిన్ దేశంలో ఉన్న తెలుగు వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ ఈరోజు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ను ఫోన్లో కోరారు. ఉక్రెయిన్లో జరుగుతున్న రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలుగువారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారని వివరించారు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకుంటున్న చర్యలను వైఎస్ జగన్కు కేంద్ర మంత్రి వివరించారు. ఉక్రెయిన్లో ఉన్న వారిని విద్యార్థులను ముందుగా పక్కదేశాలకు తరలించి అక్కడ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా చర్యలు తీసుకొచ్చే దిశగా ముమ్మర చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.
అంతకు ముందు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉక్రెయిన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను క్షేమంగా రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్, సీఎంఓ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల స్థాయిలో కాల్సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా తరలింపులో రాష్ట్రం నుంచి తగిన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.