Nara Lokesh | తెలుగుదేశం పార్టీలో పెండింగ్లో ఉన్న అన్ని పోస్టులను త్వరితగతిన భర్తీ చేస్తామని ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లో పార్లమెంటరీ పార్టీ కార్యాలయాలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు స్థలాలు గుర్తించి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కో ఆర్డినేటర్లతో నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారికి మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షంలో ఉండి పోరాడినట్లే అధికారంలోనూ జోనల్ కోఆర్డినేటర్లు పనిచేయాలని సూచించారు. అధికారంలోకి వచ్చామని ఎవరూ నిర్లక్ష్యంతో ఉండకూడదని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఉన్న కసి, అధికారంలో ఉన్నప్పుడూ కొనసాగించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకొని పనిచేయాలన్నారు. జనసేన, బీజీపే ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ఇంచార్జిల సమన్వయం ఎంతో కీలకమని తెలిపారు.
ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇంచార్జి స్థానాల్లో కొత్తవారిని త్వరలోనే నియమిస్తామని నారా లోకేశ్ తెలిపారు. అలాగే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటించాలని.. పార్టీ వ్యవహారాలను సమీక్షించాలని సూచించారు. అలాగే తప్పనిసరిగా గ్రీవన్స్ నిర్వహించేలా పర్యవేక్షించాలని ఎమ్మెల్యేలకు తెలిపారు. ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు మధ్య సమన్వయం పెంచే బాధ్యత జోనల్ కోఆర్డినేటర్లదే అని స్పష్టం చేశారు. పార్టీకి అన్నీ తామై వ్యవహరించాలని జోనల్ కోఆర్డినేటర్లకు సూచించారు.