ప్రతిపక్ష నేత చంద్రబాబు విషయంలో ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాక రేపుతున్నాయి. తన వెంట్రుక కూడా పీకలేరన్న సీఎం జగన్ వ్యాఖ్యలకు ప్రతిపక్షం నుంచి కౌంటర్లు ప్రారంభమయ్యాయి. తమ నాయకుడు చంద్రబాబుని సీఎం జగన్ ఏమీ పీకలేరని టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు. సీఎం జగన్ త్వరలోనే జైలుకు పోతారని, అప్పుడు సీఎం హోదాలో చంద్రబాబు వచ్చి, ఆయనకు ఓ ముద్ద వేస్తారని బండారు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కూడా టీడీపీ నేత బండారు ఫైర్ అయ్యారు. విశాఖ భూముల జీవోలతో వెంకన్న దగ్గరకు వస్తే, అక్కడ ప్రమాణం చేద్దామని ఎంపీ విజయసాయి రెడ్డికి టీడీపీ నేత బండారు సవాల్ విసిరారు. విజయసాయి రెడ్డి ఓ ఆడిటర్ అని, ఆయనకు సాంకేతికపరమైన విషయాలన్నీ తెలుసని బండారు అన్నారు.
వాస్తవ పరిస్థితులకు, ఊహలకు మధ్య గ్యాప్ రావడంతోనే సీఎం జగన్ భాష మారిపోయిందని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. పాలనలో అసమర్థత బయటపడకుండా వుండేందుకే సీఎం ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్‌కి ప్రజలు అధికారమిచ్చి మూడు సంవత్సరాలైందని, ఆయన ఏం పీకారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. భాష మార్చని పక్షంలో సీఎంనే ప్రజలు పీకేస్తారని కేశవ్ పేర్కొన్నారు.