Yanamala Rama Krishnudu | ఈ నెలాఖరులో ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ సభా నిర్వహణపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కీలక అంశాలను ప్రస్తావించారు. పూర్తిస్థాయి బడ్జెట్, ఓటాన్ అకౌంట్, ఆర్డినెన్స్ జారీ వంటి వాటి విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు ఇచ్చారు.
జగన్ పాలనలో సభా విధానాలు నిర్వీర్యమయ్యాయని యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెలాఖరుతోనే గత ప్రభుత్వం ఆమోదించిన ఓటాన్ అకౌంట్ గడువు ముగుస్తుందని తెలిపారు. గడువు ముగిసేలోగా బడ్జెట్ లేదా ఓటాన్ అకౌంట్ లేదా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ ఆమోదం పొందాలని పేర్కొన్నారు. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్‌కు ఆమోదం లేకపోతే ఖజానా నుంచి డబ్బులను సర్కార్ డ్రా చేయలేదని తెలిపారు. అందుకే గడువు ముగిసేలాగా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడమో లేదా ఓటాన్ అకౌంట్ ఆమోదించడమో చేయాల్సి ఉంటుందని సూచించారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉందని యనమల రామకృష్ణుడు ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుతం ఉన్న సభ ప్రొరోగ్ చేయలేదు కాబట్టి ఆర్డినెన్స్ జారీ చేయడం కుదరదని తెలిపారు. సభ ప్రొరోగ్ కాని టైమ్‌లో ఆర్డినెన్స్‌లను జారీ చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ఆమోదించుకోవాలని సూచించారు. ఒకవేళ ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీ చేయాలని భావిస్తే.. గవర్నర్ ప్రసంగం చేయించి సభను ప్రొరోగ్ చేయాలని, సభను ప్రొరోగ్ చేసిన తర్వాతే ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని తెలిపారు. ఈ ప్రక్రియల్లో ఏది చేయాలన్నా.. ఈ నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉంటుందని సూచించారు.