Pattabhi Ram | మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో టీటీడీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి అంశంలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో పట్టాభి మీడియాతో మాట్లాడుతూ.. సంచలన విషయాలు తెలిపారు.
ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి నెలకు వెయ్యి టన్నుల నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేదని తెలిపారు. ఏఆర్ సంస్థ ఉత్పత్తి చేసే నెయ్యి నెలకు కేవలం 16 టన్నులు మాత్రమేనని టీటీడీ టెక్నికల్ కమిటీ గత ఏడాది నవంబరులో నిర్ధారించిందని పేర్కొన్నారు. ఇలాంటి కంపెనీ నెలకు వెయ్యి టన్నులు ఎలా సరఫరా చేయగలదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
శ్రీవారి ప్రసాదాలకు వాడే నెయ్యిలో కూడా వైసీపీ నేతలు దోపిడీ చేసేందుకు ఏఆర్ ఫుడ్స్ డెయిరీ అడ్డుపెట్టుకున్నారని ఆధారాలు నిరూపిస్తున్నాయని పట్టాభి అన్నారు. టీటీడీ టెక్నికల్ టీమ్ రిపోర్టులను కూడా ట్విట్టర్, ఇత సోషల్ మీడియాలో జగన్ పోస్టు చేయాలని సూచించారు. సత్యమేవ జయతే అని చెబుతున్న జగన్.. తాము చూపించే ఆధారాలను ప్రజలకు చూపించగలరా అని ప్రశ్నించారు. రూ.39 కోట్ల నెయ్యి కాంట్రాక్టులో టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వాళ్లకు మద్దతు పలికే అధికారులు పాపాలు చేశారని ఆరోపించారు.
వైసీపీ చేసిన పాపాలను నిగ్గు తేల్చడానికి కూటమి ప్రభుత్వం సిట్ వేసిందని పట్టాభి తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో త్వరలోనే నెయ్యి కల్తీకి పాల్పడిన దుర్మార్గులను ప్రజల ముందు నిలబెడతామని పేర్కొన్నారు. జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, శ్రీవారి ప్రసాదాల్లో ఎవరెవరు ఎంత దోచుకున్నారో అన్నీ త్వరలోనే కక్కిస్తానని పేర్కొన్నారు. వైసీపీ నేతలు తమ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను, శ్రీవారి భక్తులను పక్కదారి పట్టించేలా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పాపాలను ప్రక్షాళన చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. స్వచ్ఛమైన నందిని నెయ్యితో శ్రీవారి ప్రసాదాలను తయారు చేయిస్తున్నామని, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.