Devineni Uma | ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ముసుగులో భారీ భూ దందాకు తెగబడ్డారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. తవ్వేకొద్దీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భూబాగోతాలు బయటపడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల ప్రభుత్వ, దేవాదాయ, చుక్కల భూములు కొల్లగొట్టారని మండిపడ్డారు.
ప్రజల ఆస్తులు వారికి తెలియకుండానే జగన్ ప్రభుత్వం స్వాహా చేసిందని దేవినేని మండిపడ్డారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ముసుగులో భారీ భూదందాకు తెగబడ్డారని విమర్శించారు. చట్టానికి తూట్లు పొడిచేలా పరిశీలన వ్యవధి రెండు రోజుల నుంచి గంటకు తగ్గించారని అన్నారు. 8 నెలల్లో రెండు లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగాయని చెప్పారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో జరిగిన భూ లావాదేవీలపై సమగ్ర విచారణ చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఒక ప్రాంతంలో ఉన్న ఆస్తిని మరో ప్రాంతాంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించే విధానమే ఎనీవేర్ రిజిస్ట్రేషన్. 2015లో అప్పటి సీఎం చంద్రబాబు దీన్ని ప్రవేశపెట్టారు. ఈ స్కీం ప్రకారం.. ఒక ఏరియా పరిధిలోని ఆస్తిని వేరొక సబ్ రిజిస్టార్ కార్యాలయ పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకోసం మనం వెళ్లిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఆ ఆస్తి తాలుకు డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు, ఇరు పార్టీలకు చెందిన ఇతర సర్టిఫికెట్లు అన్నింటినీ ఆ ఆస్తి ఏ పరిధిలోకి వస్తుందో అక్కడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు పంపిస్తారు. ఆ వివరాలు సరైనవో కావో చెప్పడానికి 48 గంటల సమయం ఇస్తారు. వివరాలన్నీ సరైనవే అయితే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే రిజిస్ట్రేషన్‌ను పెండింగ్‌లో పెడతారు. అయితే, జగన్ ప్రభుత్వం మాత్రం ఆ డాక్యుమెంట్ల పరిశీలన వ్యవధిని కేవలం గంటకు తగ్గించారు. పైగా ఆ ఆస్తి ఉన్న ప్రాంతం సబ్ రిజిస్ట్రార్‌కు డాక్యుమెంట్లు పంపించరు. దీన్ని అదునుగా చేసుకుని ప్రజల భూములను వైసీపీ పెద్దలు, ఆ పార్టీ నాయకులు తమ పేర్ల మీదకు బదలాయించుకుంటున్నారని టీడీపీ, జనసేన నేతలు కొద్దిరోజులుగా ఆరోపిస్తున్నారు.