Buddha Venkanna | అధికారం కోసం కాదు.. ప్రజల కోసమే సూపర్ సిక్స్ హామీలు అని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. మీరు పార్టీలు మారినంత ఈజీగా కులం మారిపోయారని విమర్శించారు. మా పార్టీ టీడీపీ, మా కులం బీసీ అని స్పష్టం చేశారు. ఇలాంటి పిచ్చి పిచ్చి లేఖలు రాయడం మానుకోండి అని హితవు పలికారు. సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబును నిలదీస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఎదుటి వారు బాగుంటే చూడలేని అసూయా పరులు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని బుద్ధా వెంకన్న విమర్శించారు. అధికారం కోసం కాదు ప్రజల కోసం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మరు క్షణమే రూ.3వేల పింఛన్‌ను రూ.4వేలు చేసి ఏప్రిల్ నెల నుంచి ఇచ్చిన విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మీ వాళ్లకు కనబడలేదా రెడ్డిగారు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో.. పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో గ్యాస్ సీలిండర్లు ఇవ్వడం మీకు కనబడలేదా రెడ్డి గారు అని విమర్శించారు. కనబడని యెడల ఒక్కసారి యూట్యూబ్‌లో చూడగలరని ఆశిస్తున్నామని అన్నారు. ఎప్పుడు నా జాతి నా జాతి అని మాట్లాడే మీరు పవన్ కళ్యాణ్‌ను అంత పెద్ద స్థాయిలో చూసేసరికి ఓర్వలేక ఇలా మాట్లాడుతున్నారని ప్రజలు కూడా అనుకుంటున్నారని అన్నారు.
స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు, కూటమి నాయకులు మీలాగా లేఖలు రాయరని బుద్దా వెంకన్న అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో స్టీల్ ప్లాంట్ విషయం మాట్లాడి స్టీల్ ప్లాంట్ “విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు” కాబట్టి దానిని కూటమి నాయకులు అందరు కూడా కలసి కట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడ ఎటువంటి అన్యాయం జరగకుండా యథావిధిగా సాగే లాగా చేస్తారని చెప్పారు. తొందరపడి లేఖలో సున్నితమైన విషయాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. కులాల మధ్యన గొడవపెట్టడం మీకు అలవాటే అని విమర్శించారు. అలాగే కార్మికులకు కూటమి ప్రభుత్వాన్నికి గ్యాప్ తీసుకు వద్దామనే మీ లేఖలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి రాశారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు ఈ విశాఖ ఉక్కు మీద ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆ రోజు అక్కడికి వెళ్లి విశాఖ ఉక్కు కోసం నిరాహారదీక్ష చేస్తున్న వాళ్లకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని నిలదీశారు. ఇవన్ని మీ స్వార్థ రాజకీయాలు కాదా అని మండిపడ్డారు.
అసలు 1994 లో పత్తిపాడు అసెంబ్లీకి మీరు పోటీ చేసినప్పుడు అన్ని కులాలు మీకు ఓటు వేయకుండా వెలివేస్తే 1999 లో అయ్యో పాపం అని కాకినాడ పార్లమెంట్ సీటు కేటాయించి మిమ్మల్ని ఎంపీని చేసింది చంద్రబాబు కాదా అని ముద్రగడను బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. చంద్రబాబుకు రుణపడి ఉంటానని ఆ రోజు మీరు స్టేట్మెంట్ ఇచ్చింది నిజం కాదా అని అడిగారు. చంద్రబాబుపై అసభ్య పదజాలంతో ఈ రోజు లేఖ రాయడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
సూపర్ సిక్స్ పథకాలు అన్ని కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకు అందజేస్తుందని బుద్ధా వెంకన్న అన్నారు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యేసరికి మీ జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ చేసి ఇడుపులపాయకి పంపించారు. అది మీకు కూడా తెలిసి ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈవేళ సంపదను సృష్టించి ఆ సంపదని పేదవాడికి పంచడమే కాకుండా చంద్రబాబు, కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ హామీలు ప్రజలకు అందుతాయని స్పష్టం చేశారు. దయచేసి ఇలాంటి పిచ్చి లేఖలు రాయకండని హితవు పలికారు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. మీరు కంటెంట్ లేని లేఖలు రాసినా.. దానికి వెంటనే కంటెంట్‌తో బదులిచ్చే సమాధానం తమ దగ్గర ఉందని తెలిపారు. పార్టీలు మారినంత ఈజీగా కులం కూడా మారిపోయారని ఎద్దేవా చేశారు. అది తమకు చేత కాదని చెప్పారు. తమ పార్టీ టీడీపీ అని, తమ కులం బీసీ అని స్పష్టం చేశారు. ఎప్పుడూ ఒకే జెండా, ఎజెండాతో పనిచేస్తామని తెలిపారు.