buddha venkanna | మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. డిక్లరేషన్‌పై జగన్ ఎందుకు అంత రాద్దాంతం ప్రశ్నించారు. తిరుమలపై జగన్ స్వార్థ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
తిరుమల పర్యటన రద్దు చేసుకున్న అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బుద్దా వెంకన్న అన్నారు. మనం అనుకుంటే కాదు.. ఆ స్వామి వారు అనుగ్రహిస్తేనే తిరుమలకు వెళ్లగలం అని ఆయన చెప్పారు. వెంకన్న స్వామి అనుమతి లేదు కాబట్టే జగన్ వెళ్లలేకపోయారని విమర్శించారు.
ఇంట్లో బైబిల్ చదువుకునే జగన్‌కు వెంకన్న మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. నిబంధనల మేరకు డిక్లరేషన్ అడిగితే రాద్దాంతం ఎందుకు అని నిలదీశారు. నీ భార్యను కూడా తిరుమల తీసుకురాలేవని.. సీఎం హోదాలోనే నీ ఇంట్లో వాళ్లు నీ మాట వినలేదంటూ విమర్శించారు. ఇప్పుడు టీడీపీపై బురద జల్లాలని చూస్తున్నారని అన్నారు.
గతంలో తిరుమల మాడ వీధుల్లో జగన్ చెప్పులు వేసుకుని తిరిగారని.. ఇప్పుడు నెయ్యి కల్తీ వివాదంలోనూ ఆయన పాత్ర ఉందని బుద్దా వెంకన్న ఆరోపించారు. అందుకే టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని జగన్ వెనుకేసుకొస్తున్నాడని విమర్శించారు. తిరుమల సాక్షిగా తప్పు చేయలేదని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.
జగన్ హయాంలో అన్ని అవినీతి, అక్రమాలే అని బుద్దా వెంకన్న విమర్శించారు. ఈ అవినీతిపై కూటమి ప్రభుత్వం విచారణ మొదలుపెట్టడంతో జగన్‌కు భయం పట్టుకుందని అన్నారు. అందుకే ఇప్పుడు ప్రతి అంశాన్ని కుల, మతాల వారీగా వివాదం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా జగన్ బుద్ది తెచ్చుకొని.. తీరు మార్చుకోవాలని హితవు పలికారు.