Budda Venkanna | వైఎస్ జగన్‌కు ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లి నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. సీతానగరం బోటు యార్డ్ కాంపౌండ్‌లో 870.40 చదరపు మీటర్ల స్థలంలో అక్రమంగా కేంద్ర కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ సీఆర్డీఏ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏడు పొక్లెయినర్లతో దాదాపు రెండు గంటల పాటు శ్రమించి.. వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. కూటమి ప్రభుత్వం చేసిన ఈ చర్యపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు.
ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేశారని అన్నారు. హైకోర్టు ఆదేశాలను భేఖాతరు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని విమర్శించారు. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారని అన్నారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేదే లేదని, వెన్నుచూపేది అంతకన్నా లేదని పేర్కొన్నారు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తామని చెప్పారు. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని విజ్ఞప్తి చేశారు.
వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా, అవినీతి సొమ్ముతో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించబోయారని విమర్శించారు. శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటాననుకోని ఈ నిర్మాణాలు చేపట్టారని అన్నారు. అయితే ఆ కట్టడాలకు పర్మిషన్లు సరిగ్గా లేకపోవడంతో సంబంధిత అధికారులే కూల్చేశారని స్పష్టం చేశారు. నీలాగా ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చట్లేదని అన్నారు. నీలాంటి సైకో పనులు చంద్రబాబు ఎప్పటికీ చేయరు.. చేయబోరని పేర్కొన్నారు.