అమరావతి : లోకంలో లేని, సంజాయిషీ ఇచ్చుకోలేని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YSR ) , తాత రాజారెడ్డి( Rajareddy ) పై టీడీపీ దుష్ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) అన్నారు. వారు అంత దుర్మార్గులే అయితే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విచారణ జరపలేదు ? ఎందుకు శిక్షించలేదు ? మీకు చేతకాలేదా? అంటూ ట్విటర్ వేదిక ద్వారా ప్రశ్నించారు.
కూటమి అధికారంలోకొచ్చి రెండేళ్లు అవుతుంది. చెప్పుకోదగ్గ విజయాలు లేకనే, పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు దివంగతులను లాగి టీడీపీ నీచ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. పగబట్టి తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన ఉత్తములు అయిపోరని, ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి ఎక్కడ పడుతుందో రెండేళ్లుగా అధ్వాన్న పాలన చేసే ఆపర మేధావులు తెలుసుకోవాలని హితవు పలికారు.
వైఎస్ రాజారెడ్డి సీమలో జరిగిన అరాచకాలు ఎదురించి పేదల పక్షాన నిలబడ్డ వ్యక్తని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి అనే పదాలకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరునామా అని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, రుణమాఫీ, ఉచిత కరెంటు లాంటి పథకాలు వైఎస్సార్‌కే సాధ్యమయ్యాయని తెలిపారు. పోలవరాన్ని మొదలు పెట్టి 33 శాతం పనులు 5 ఏళ్లలో పూర్తి చేస్తే, తర్వాత రెండు సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు గారికి మిగతా పనుల పూర్తికి చేతకాలేదదని విమర్శించారు.