Tirumala | తిరుమల శ్రీవారి ఆలయ క్యూలైన్లో ప్రాంక్ వీడియోలు చేయడం సంచలనం సృష్టించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడంపై అటు సాధారణ ప్రజలతో పాటు టీటీడీ అధికారులు మండిపడ్డారు. ఈ క్రమంలో వీడియో తీసిన తమిళనాడుకు చెందిన యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ క్షమాపణలు చెప్పారు.
మేం కూడా శ్రీవారి భక్తులమే.. భక్తుల ఇబ్బందులను చెప్పాలనే ఉద్దేశంతోనే వీడియో తీశామని టీటీఎఫ్ వాసన్ తెలిపారు. ఆ వీడియో చేస్తున్న సమయంలో తోటి మిత్రుడు ఒకరు చేసిన చర్య కొందరి మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు. దీనికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నామని పేర్కొన్నారు. ఇకపై అలాంటి వీడియోలను తీయకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఒక వీడియోను రిలీజ్ చేశారు.
ఇటీవల తమిళ యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ స్నేహితుల బృందం తమిళనాడు నుంచి తిరుమలకు వచ్చింది. ఈ సందర్భంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వాళ్లు ఒక వీడియోను చిత్రీకరించారు. ఈ క్రమంలో దర్శనం కోసం క్యూ లైన్లో నిల్చున్న భక్తులను ఒక యూట్యూబర్ ఆటపట్టించాడు. కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న భక్తుల దగ్గరకు టీటీడీ ఉద్యోగిలా వెళ్లిన సదరు యూట్యూబర్.. తాళం తీస్తున్నట్లుగా నటించాడు. దీంతో అప్పటిదాకా కంపార్ట్మెంట్లో కూర్చున్న భక్తులు ఒక్కసారిగా డోర్ దగ్గరకు రావడం మొదలుపెట్టారు. ఇంతలోనే అందర్నీ వెక్కిరించుకుంటూ ఆ యూట్యూబర్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్ కావడంతో అటు భక్తులతో పాటు టీటీడీ అధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిబ్బందిని టీటీడీ అధికారులు ఆదేశించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను తమిళనాడుకు కూడా పంపించారు.
తిరుమలలో ఫ్రాంక్ వీడియోలపై తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీటీఎఫ్ వాసన్ స్పందించారు. మమ్మల్ని క్షమించాలని కోరాడు. pic.twitter.com/4mgpLcV9Sk
— ChotaNews (@ChotaNewsTelugu) July 13, 2024