Rathotsavam | శ్రీశైలం : ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలంలో మల్లికార్జునస్వామి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వర్ణ రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఆలయంలో మంగళవారం ఉదయం అర్చక వేదపండితులు పంచామృతాభిషేకాలు, వివిధ రకాల ఫలోదకాలు, శుద్ధ జలాలతో స్వామివారిని అభిషేకించి మహాబిల్వార్చన, పుష్పార్చనలు చేశారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ మహా సంకల్పాన్ని పఠించి శాంతి మంత్రాలు పఠించారు. అనంతరం స్వర్ణరథంపై ఆశీనులైన స్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్త పూజలు చేసి, మంగళహారతులు సమర్పించారు. ఆలయ మహాద్వారం నుంచి నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ రథోత్సవం నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వర్ణ రథోత్సవాన్ని ప్రతి మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున నిర్వహించనున్నట్లు తెలిపారు.