Swarna Ratham | శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి క్షేత్రమైన శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం కనుల పండువగా జరిగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని గురువారం రథోత్సవం నిర్వహించారు. అంతకుముందు వేకువ జామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్వర్ణరథంలో స్వామి, అమ్మవార్లకు ప్రతిష్టించారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం పటించి స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ రథోత్సవాన్ని మహాద్వారం ఎదుట నుంచి ఆలయ నాలుగు మాఢవీధుల్లో నిర్వహించారు. రథోత్సవంలో కోలాటం, చెక్క భజనలు, జానపదా కళారూపాలు భక్తులను అలరించాయి.
రథోత్సవంలో జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి, ఈవో డీ పెద్దరాజు దంపతులు, అర్చకస్వాములు, వేదపండితులు, పలునిభాగాల అధికారులు, పర్యవేక్షకులు, శివసేవకులు పాల్గొన్నారు. స్వర్ణరథం దాతలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు సైతం ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో జన్మల పుణ్యఫలితంగానే తమకు స్వర్ణరథం సమర్పించే అవకాశం లభించిందన్నారు. ప్రతినెలా ఆరుద్ర నక్షత్రం రోజున దేవస్థానం రథోత్సవం నిర్వహించడం ఆనందం కలిగిస్తుందన్నారు. ఈవో పెద్దిరాజు దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ధర్మప్రచారంలో భాగంగా దేవస్థానంలో మరిన్ని భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామన్నారు.