Srisailam | శ్రీశైలం మహాక్షేత్రంలో ప్రతి రోజూ అక్క మహాదేవి అలంకార మండపంలో మూడు విడుతలుగా స్వామి వారి సామూహిక అర్జిత అభిషేకాలు జరిగేవి. అక్క మహాదేవి అలంకార మండపానికి మరమ్మతులు నిర్వహిస్తుండటంతో ప్రస్తుతం ఈ సామూహిక అభిషేకాలు స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణ మండపంలో జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరి నుంచి రూ.1500 రుసుముతో ఈ సామూహిక ఆర్జిత అభిషేకాలు నిర్వహిస్తున్నారు.
స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణ మండపంలో సామూహిక ఆర్జిత అభిషేకాలు నిర్వహించడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రతి రోజూ ఉదయం జరిగే శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రమహ్మణ్య స్వామి వారి కల్యాణం, సాయంకాలం జరిగే స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం కాలాతీతం అయ్యే ఇబ్బంది కలుగుతోంది. దీనివల్ల ప్రస్తుతం నిత్య కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న సామూహిక ఆర్జిత అభిషేకాలు ఇక మీదట ఆలయ ప్రాంగణంలోని మూడు శివాలయాల (సహస్ర దీపాలంకరణ సేవ మండపం వెనుక) వద్ద, అక్క మహాదేవి – హేమారెడ్డి మల్లమ్మ మందిరాలు (నవబ్రహ్మ ఆలయాల పక్కన) నిర్వహిస్తారని దేవస్థానం ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు.
గతంలో మాదిరిగానే యథావిధిగా రోజూ మూడు విడుతలుగా ఉదయం ఆరు గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి ఏడు గంటలకు ఈ సామూహిక ఆర్జిత అభిషేకాలు నిర్వహిస్తామని శ్రీశైలం ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. ఒక్కో విడుతలతో 100 టిక్కెట్లు మాత్రమే జారీ చేస్తారు. గతంలో మాదిరిగా ఆన్ లైన్ లోనే భక్తులు ఈ టికెట్లు పొందాల్సి ఉంటుందని తెలిపారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే తిరిగి అక్క మహాదేవి అలంకార మండపంలోనే ఈ సామూహిక ఆర్జిత అభిషేకాలు నిర్వహిస్తారు.
ప్రతి మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు ఉదయం స్వామి వారికి దేవస్థానం సేవ నిర్వహిస్తారు. అలాగే ప్రతి నెలా మాస శివరాత్రి రోజు సాయంత్రం స్వామి వారికి సర్కారీ సేవ నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. కనుక ఆరుద్ర నక్షత్రం రోజు ఉదయం, మాస శివరాత్రి రోజు సాయంత్రం స్వామివారి స్పర్శ దర్శనం టికెట్లు నిలిపేస్తున్నట్లు వెల్లడించారు. కనుక భక్తులు ఈ మార్పులను గమనించాలని కోరారు.