అమరావతి : ఏపీలో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు సుప్రీంకోర్టులో (Supreme Court) నిరాశే ఎదురయ్యింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ( Nandigam Suresh ) నిందితుడిగా ఉన్నారు. హత్య కేసులో తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు.
2020లో వెలగపూడిలో (Velagapudi) రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ అనే మహిళ మరణించింది. పోలీసులు ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేశారు. వైసీపీ (YCP) అధికారంలో ఉండటంతో కేసు విచారణ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు విచారణ ప్రారంభమైంది. ఈ హత్య కేసులో సురేష్‌ను పోలీసులు అరెస్టు చేయగా బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. కేసు తీవ్రత దృష్ట్యా సురేష్‌కు ఏపీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నందిగం సురేష్ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలో మంగళవారం పిటిషన్ విచారణకు రాగా ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయకపోవడంతో తాము కూడా జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ కేసులో చార్జిషీటు కూడా దాఖలైందున బెయిల్ కోసం మరోసారి ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.