YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి దంపతులపై పెట్టిన కేసులను సుప్రీంకోర్టు క్వాష్ చేసింది. ఈ కేసు విచారణను మంగళవారం చేపట్టిన జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ఎన్కే సింగ్‌ల ధర్మాసనం.. తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.
ఈ కేసు విచారణ సందర్భంగా.. అవినాశ్ రెడ్డి సహా ప్రధాన నిందితుల బెయిల్ రద్దు చేయాలని సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని.. అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో బయటకు రావాల్సి ఉందని తెలపిఆరు. సాక్షులను బెదిరించడం, సాక్ష్యాలను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని కోర్టుకు వివరించారు. సునీత దంపతులతో పాటు అప్పటి సీబీఐ విచారణాధికారి రాంసింగ్‌పై కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు.
సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. నిందితులను కాలపరిమితి లేకుండా జైలులో ఉంచడం మంచిది కాదని అన్నారు. కానీ హత్య తీరు చూస్తే నిందితులకు 2, 5 ఏళ్లు చాలా తక్కువే అనిపిస్తుందని అభిప్రాయం వినిపించారు. ఆధారాలు చెరిపివేయడం, సాక్ష్యాధారాలు లేకుండా చేయడం నిరూపితమైందని పేర్కొన్నారు. హత్య అని తెలియకుండా అన్ని ప్రయత్నాలు చేశారని, అన్ని వివరాలు దర్యాప్తులో పూర్తిగా బయటపడ్డాయని చెప్పారు. కాగా, వాదలు విన్న అనంతరం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సునీత దంపతులతో పాటు అప్పటి సీబీఐ విచారణాధికారి రాంసింగ్‌పై పెట్టిన కేసులను క్వాష్ చేస్తున్నామని తెలిపింది.