AP News | టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. దేవినేని అవినాశ్, జోగి రమేశ్ సహా ఐదుగురు వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు అరెస్టు నుంచి వారికి రక్షణ కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 48 గంటల్లో పాస్‌పోర్టులను అప్పగించాలని ఆదేశించింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం, ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, జోగి రమేశ్ నిందితులుగా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం వారు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ సుధాన్షు దులియా, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వారికి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు సూచించింది.
దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సాంకేతిక కారణాల వల్ల ఇవాళ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేకపోతున్నామని తెలిపింది. తదుపరి విచారణను నవంబర్ 4 వరకు వాయిదా వేసింది. అప్పటివరకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దర్యాప్తునకు సహకరించకపోతే రక్షణ ఉండదని స్పష్టం చేసింది.