అమరావతి : రెండేండ్ల పాటు కొవిడ్‌తో ఆటలకు దూరమైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్లో ఉత్సాహం నింపేందుకు వేసవి శిక్షణా శిబిరాలను ప్రారంభించినట్లు ఏపీ మంత్రి రోజా పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ క్రీడా మైదానంలో ఇవాళ వేసవి శిక్షణా శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు ఆటలు ఆరోగ్యాన్ని ఇవ్వటంతో పాటు పతకాలను తెచ్చిపెడతాయని అన్నారు.
శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయడం మంచి పరిణామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 48 క్రీడా విభాగాల్లో 1,670 వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని వెల్లడించారు.