అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low pressure) మంగళవారం మధ్యాహ్నం బలపడింది. కేంద్రీకృతమైన అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department) తెలిపారు. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు కదలుతూ రేపటికి తీవ్ర తుపానుగా మారి, చెన్నైకి దక్షిణంగా తీరం దాటవచ్చని అంచనా వేశారు.
ఏపీలో ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు(Nellore), ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బయటికొచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా జలదంకి మండలంలో 17.7 సెం.మీ, నిడవలూరులో 17.3, అల్లూరులో 15.4, కావలిలో 15.1, కొడవలూరులో 14 సెం.మీ వర్షపాతం నమోదైంది. బాపట్ల(Bapatla) జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
భారీ వర్షానికి దుద్దుకూరు దగ్గర యార వాగు ఉధృతి ప్రవహిస్తోంది. దీంతో ఒంగోలు-ఇంకొల్లు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖపట్నం, కడప, తిరుపతి, చిత్తూరు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.
భారీ వర్షాల హెచ్చరికతో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలో విద్యాసంస్థలకు (School Holidays, ) సెలవులు ప్రకటించారు. ప్రజలు, అధికారులు మూడ్రోజులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. తీరప్రాంతాల్లో గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.,మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.