తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం కొలువుదీరిన తిరుమలలో అన్యమత ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ నూతన చైర్మన్ (TTD Chairman) బీఆర్ నాయుడు (BR Naidu) స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారిగా టీటీడీ అధికారులతో సమీక్షను నిర్వహించారు. శ్రీవారి నిధుల వినియోగంపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. శ్రీవారి పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తామని అన్నారు. సమావేశంలో పాలక మండలి నూతన సభ్యులు పాల్గొన్నారు.
టీటీడీ చైర్మన్ ప్రమాణం
తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి చైర్మన్ గా బి.ఆర్.నాయుడు బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి భూ వరహాస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకున్నారు. టీటీడీ(TTD) అధికారులు బి.ఆర్.నాయుడుకు స్వాగతం పలికారు.
ఆలయంలో బంగారు వాకిలి వద్ద ఈవో జె.శ్యామలరావు బి.ఆర్.నాయుడు తో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకోగా రంగ నాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో చైర్మన్ ను శాలువతో సన్మానించి ప్రసాదం, చిత్రపటం, డైరీలు, క్యాలెండర్లు అందించారు.
సభ్యుల ప్రమాణం..
అనంతరం ధర్మకర్తల మండలి సభ్యులుగా దేవాదాయశాఖ సెక్రటరీ సత్య నారాయణ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జంగా కృష్ణమూర్తి, మల్లెల రాజశేఖర్ గౌడ్, జాస్తి పూర్ణ సాంబశివరావు, ఎం.ఎస్.రాజు, నర్సిరెడ్డి, బూంగునూరు మహేందర్ రెడ్డి, అనుగోలు రంగ శ్రీ, ఆనంద్ సాయి, జానకి దేవి తమ్మిశెట్టి, ఆర్.ఎన్.దర్శన్, ఎం.శాంతారామ్, ఎస్.నరేష్ కుమార్, డాక్టర్ ఆదిత్ దేశాయ్, ప్రమాణ స్వీకారం చేశారు.