Free Bus | ఏపీలో ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. స్త్రీ శక్తి పేరిట ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఐదు కేటగిరీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నారు.
తిరుమల బస్సుల్లో నో ఫ్రీ!
పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. బాలికలు, మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత ప్రయాణం అందించనున్నారు. నాన్‌స్టాప్, సరిహద్దు రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. తిరుమల ఘాట్ రోడ్డుపైకి వెళ్లే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం లేదు. అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదో ఒక కార్డు చూపించి మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం పొందవచ్చు. బస్సు ఎక్కిన మహిళలకు జీరో ఫేర్ టికెట్లను జారీ చేస్తారు. ఆ ఖర్చును ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేయనుంది.
బస్సుల్లో కెమెరాలు!
మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగు చర్యలు తీసుకోనున్నారు. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ వార్న్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీఎస్ ఆర్టీసీ పరిధిలో మొత్తం 11,449 బస్సులు ఉన్నాయి. వీటిలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు(5851), ఎక్స్‌ప్రెస్‌లు (1610), సిటీ ఆర్డినరీ (710), సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ (287)లు కలిపి మొత్తం 8,458 బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నారు. అల్ట్రా డీలక్స్ (643), సూపర్ లగ్జరీ (1486), నాన్ ఏసీ స్లీపర్ స్టార్‌లైనర్ (59), ఏసీ బస్సులు (459), తిరుమల ఘాట్ బస్సులు (344) కలిపి మొత్తం 2991 బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనుమతించరు.