అమరావతి : ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యం లేదని మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని హోంమంత్రి అనిత ( Home Minister Anitha ) వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు (YS Jagan) సూచించారు. ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసం, మహిళలపై జరిగిన దారుణాలు ప్రజలు మరిచిపోలేదని గురువారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
జగన్ పాలనలో గంజాయి ( Ganja), డ్రగ్స్ (Drugs) విచ్చలవిడిగా పెరుగడం వల్ల ఎన్ని నేరాలు జరిగాయో లెక్కలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాలనను గాడిన పెట్టడానికి చర్యలు తీసుకుంటుంటే సోషల్ మీడియాలో రాష్ట్ర మహిళలకు హననం కలిగించే పోస్టింగులు పెడుతూ ఆనందాన్ని పొందుతున్నారని దుయ్యబట్టారు. కొన్ని పోస్టుల గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉందని వెల్లడించారు.
వైసీపీ కార్యకర్త నర్రా రవీంద్రరెడ్డి దారుణమైన పోస్టులు పెట్టారని, చివరకు విజయమ్మ, షర్మిలపై దారుణమైన పోస్టులు పెట్టడం శోచనీయమని అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అనేక మందిపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. అమరావతి మహిళా రైతులపై నీచాతి నీచంగా మాట్లాడారని ఆరోపించారు. రాజకీయాల ముసుగులో క్రిమినల్స్‌కు వంత పాడుతున్నారని ఆమె విమర్శించారు.