అమరావతి : టీడీపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల నిబద్ధతతో వ్యవహరించి, కృష్ణా జలాల ( Krishna Water ) పై రాష్ట్ర హక్కులను కాపాడాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (YS Jagan Mohanreddy) ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu )కు రాసిన లేఖను ట్విటర్లో పోస్టు చేశారు.
రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీ నికర జలాల్లో ఒక్క టీఎంసీ కోల్పోయే పరిస్థితి తలెత్తినా, దానికి టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాబోయే కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 విచారణ ముందు తన వాదనను వినిపించే అవకాశం ప్రభుత్వానికి ఉందని తెలిపారు.
కృష్ణా నదిలో 763 టీఎంసీ నీటిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుందని గుర్తు చేశారు. ఈ డిమాండ్‌ను ట్రిబ్యునల్ అంగీకరిస్తే, ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు తన తుది వాదనలను వినిపించి నికర జలాలు తరలిపోకుండా అడ్డుకోవాలని సూచించారు.
1996లో నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా కూడా ఉన్న సమయంలో ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచడం వల్ల ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు , రైతులు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. నాడు చంద్రబాబు పట్టించుకోకపోవడంతో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కర్ణాటకకు ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును పెంచడానికి అనుమతి ఇచ్చిందని తెలిపారు.
2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు వదులుకుందని ఆరోపించారు. నికర జలాలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే డిమాండ్‌కు తలొగ్గవద్దని చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.