Srisailam | శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవోగా ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ నియామకమయ్యారు. ఆలయ పరిపాలన భవనంలో సోమవారం ఆయన ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జి ఈవో చంద్రశేఖరరెడ్డి బాధ్యతలను అప్పగించారు. అంతకుముందు ఆయన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు దేవస్థానానికి చెందిన ఆయా విభాగాల అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈవో మాట్లాడుతూ స్వామి అమ్మవార్ల అనుగ్రహంతో శ్రీశైలం ఈవోగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం లభించిందన్నారు. స్వామిఅమ్మవార్లను సేవించుకునే భాగ్యం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సీఎం, దేవాదాయశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో శ్రీశైల క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలనేది తన సంకల్పమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఉన్నతాధికారులు, దేవస్థానం సిబ్బంది సహకారంతో శ్రీశైల క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తగుచర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. స్వామిఅమ్మవార్లకు కైంకర్యాలన్ని ఆగమశాస్త్రాల మేరకు నిర్వహించేలా అర్చకులు, వేదపండితుల సహకారంతో కృషి చేస్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా దర్శనాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్ర సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తానన్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా గో సంరక్షణ, ధర్మప్రచారం కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. చెంచుగూడాలకు దేవస్థానం ధర్మప్రచార రథాన్ని పంపి, శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవాలను జరిపిస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణకు, క్షేత్రసుందరీకరణలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. సిబ్బంది కూడా జవాబుదారితనంతో పారదర్శకంగా విధులు నిర్వహిస్తూ దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.