హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): గత ఏడాదిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 1,403.74 కోట్లు సమకూరింది. రికార్డు స్థాయిలో వరుసగా 22వ నెల కూడా రూ.100 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక్క డిసెంబ ర్లోనే రూ.116 కోట్ల ఆదాయం రావడం విశేషం. స్వామివారి హుండీ ఆదాయం వివరాలను టీటీడీ ఈవో వైవీ ధర్మారెడ్డి మంగళవారం వెల్లడించారు. 2023లో స్వామివారిని 2.54 కోట్ల మంది భక్తులు దర్శించుకొన్నట్టు చెప్పారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంలో అధికం
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని డిసెంబర్ 23 నుంచి 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం జరిగింది. ఈ 10 రోజుల్లో 6,47,452 మంది శ్రీవారిని దర్శించుకున్నారని ఈవో తెలిపారు. హుండీ ద్వారా రూ.40.10 కోట్లు ఆదాయం వచ్చిందని చెప్పారు.