Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలో అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠ నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బందితోపాటు శివసేవకులు, ఉభయ దేవాలయాలు, పరివార దేవతాలయాల హుండీలను లెక్కించారు. కార్తీక మాసాంతం 28 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ.06,14,22,180 ఆదాయంగా వచ్చినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.
అలాగే, భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు 403.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 10 కేజీల వెండి ఆభరణాలు కూడా లభించాయని ఈవో పెద్దిరాజు చెప్పారు. వీటితోపాటు 118 యూఎస్ఏ డాలర్లు, 130 యూఏఈ ధీరమ్స్, 100 యూకే పౌండ్స్, 40 ఆస్ట్రేలియా డాలర్లు, 22 మలేషియా రింగెట్స్, 19 సింగపూర్ డాలర్లు, 20 కెనడా డాలర్లు, పది యూరోలను స్వామి అమ్మవార్లకు భక్తులు మొక్కులుగా హుండీలో సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.