Srisailam | శ్రీశైల క్షేత్రానికి వచ్చే మల్లన్న భక్తుల సేవకు పెద్దపీట వేస్తున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి చెప్పారు. ఇందుకోసం చేపట్టిన కీలక అభివృద్ది పనులకు ఆమోదం తెలుపుతున్నట్లు తెలిపారు. మంగళవారం ఛైర్మన్ అధ్యక్షతన ఈఓ పెద్దిరాజు సమక్షంలో జరిగిన ట్రస్ట్‌బోర్డ్ సమావేశంలో దేవస్థానం అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. క్షేత్ర పరిధిలో రూ. కోట్లతో చేపట్టవలసిన పనుల్లో చేపట్టాల్సిన 59 ప్రధాన అంశాల్లో 57 అంశాలకు ఆమోదం తెలిపినట్లు చక్రపాణి రెడ్డి తెలిపారు.
ప్రణాళిక ప్రకారం జరగవలసిన పనుల్లో ఎటువంటి అలసత్వం వహించకుండా భక్తులకు వీలైనంత త్వరగా సౌకర్యాలను కల్పించాలని అధికారులను రెడ్డివారి చక్రపాణి రెడ్డి సూచించారు. సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టేలా నూతన నమూనా భవనం, రోడ్డ విస్తరణ, ల్యాండ్‌స్కేపింగ్, కళామందిరం, సప్త గోకులం, విద్యుదీపాలంకరణతోపాటు వాటి నిర్వహణ, అధునాతన ప్రసార వ్యవస్థ సామాగ్రి, ఎల్ఈడీ లైట్లు, సీసీ కెమెరాల కొనుగోలు నిర్వహణ, రుద్రపార్కు, రింగ్ రోడ్డ్ పరిధిలో పలుచోట్ల ఫెన్సింగ్ పనులు చేపట్టాల్సి ఉందన్నారు.
ఇక శ్రీశైల మార్గాన్ని గుర్తించేలా కల్వకుర్తి అచ్చంపేట్ ప్రాంతాల్లో ఆర్సీసీ ముఖద్వారాల నిర్మాణం, నూతన ఏటీఎంలు, అన్నప్రసాద వితరణ కేంద్రాల్లో సౌకర్యాలు వంటి అభివృద్ది పనులను చేపడతామని రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఈఈ రామకృష్ణ, ఏసీ వెంకటేష్, మురళీధర్‌రెడ్డి, ఏఈవోలు ఫరిధర ప్రసాద్, మోహన్, హరిదాసు, ధర్మకర్తల మండలి సభ్యులు విరూపాక్షయ్య, సుజాతమ్మ, విజయలక్ష్మి, రామేశ్వరి, హనుమంతునాయక్, మధుసూదన్‌రెడ్డి, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలానికి నడకదారిలో వచ్చే భక్తులకు మార్గదర్శకంగా ఉండేలా ఏపీ మెడిసెనల్ అండ్ అరోమ్యాటిక్ ప్లాంట్ బోర్డ్ సీఈవో కొమ్మంటి అశోక్ కుమార్ రచించిన శ్రీశైల యాత్ర గ్రంధాన్ని చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈఓ పెద్దిరాజు ఆవిష్కరించారు. 2008లో తెలుగులో రచించిన ఈ గ్రంధాన్ని కన్నడ భాషలో అనువదించినట్లు ఈవో తెలిపారు. నాగలూటి వీరభద్రస్వామి, దామెర్లకుంట, పెద్దచెరువు, మఠంబావి, భీముని కొలును, కైలాసద్వారం తదితర ప్రదేశాల గురించి విపులీకరించిన ఈ గ్రంధం యాత్రికులకు క్షేత్ర వైభవాన్ని మరింత చాటేలా ఉందని చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి అన్నారు.