Hundi Income | శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని బుధవారం అధికారులు లెక్కించారు. గత 27 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు కానుకలు నగదు రూపంలో రూ.4.51కోట్ల ఆదాయం సమకూరిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. నగదుతో పాటు 164.500 గ్రాముల బంగారం, 5.840 కేజీల వెండి వస్తువులు కానుకలుగా వచ్చాయని పేర్కొన్నారు.
వీటితో పాటు 598 యుఎస్ఏ డాలర్లు, 20 కెనడా డాలర్లు, 100 న్యూజిలాండ్ డాలర్లు, పది ఇంగ్లండ్ పౌండ్స్, 100 సింగపూర్ డాలర్లు, 100 ఈరోస్, 115 సౌదీ అరేబియా రియాల్స్, 102 కత్తార్ రియాల్స్, 300 ఒమన్ బైసా, ఒకటి కువైట్ దినార్ మొదలైన విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు భక్తులు మొక్కులుగా హుండీలో సమర్పించినట్లు ఈవో వివరించారు. హుండీలెక్కింపు కార్యక్రమాన్ని ప్రత్యేక నిఘా నేత్రాల పర్యవేక్షణలో చంద్రావతికల్యాణ మండపంలో ఆలయ అధికారులు, సిబ్బందితోపాటు శివసేవకుల సహాయంతో లెక్కింపు జరిగినట్లు డిప్యూటీ ఈవో రవణమ్మ తెలిపారు.