Ugadi | శ్రీశైలం : ఉగాది మహోత్సవాలకు శ్రీశైల క్షేత్రం ముస్తాబైంది. ఈ నెల 27 నుంచి 31 వరకు ఐదురోజుల పాటు ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాల్లో జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీమల్లికార్జున స్వామివార్లకు విశేషార్చనలు నిర్వహించనున్నారు. మహాశక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు వాహనసేవలు జరుగనున్నాయి. ఉత్సవాల్లో తొలిరోజైన గురువారం భ్రమరాంబ అమ్మవారు మహాలక్ష్మీ అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తారు. సాయంత్రం భృంగి వాహనంపై ఆదిదంపతులు విహరించనున్నారు.
28న అమ్మవారు మహాదుర్గ అలంకారణలో దర్శనం ఇవ్వనుండగా.. కైలాస వాహన సేవ జరుగనున్నది. 29న అమ్మవారు చదువుల తల్లీ సరస్వతీదేవిగా కనిపించనున్నది. అదే రోజున ప్రభోత్సవం, నందివాహన సేవతో పాటు వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశాలు జరుగనున్నాయి. ఉగాది పర్వదినమైన 30వ తేదీ రోజున భ్రమరాంబాదేవి రాజరాజేశ్వరిగా అనుగ్రహించనున్నది. ఆలయంలో ఉదయం విశ్వాసునామ సంవత్సరం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం ఉంటుంది. అదే రోజున సాయంత్రం సమయంలో రథోత్సవం జరుగుతుంది. 30న అమ్మవారు భ్రమరాంబాదేవి నిజ ప్రదర్శనం ఉండనుండగా.. పూర్ణాహుతి, అశ్వవాహన సేవతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఉత్సవాల్లో తొలిరోజైన గురువారం యాగశాల ప్రవేశంతో ఉగాది ఉత్సవాలు మొదలవుతాయి. ఉదయం 9 గంటల నుంచి శివ సంకల్పం, గణపతిపూ, కంకణధారణ, చండీశ్వరపూజ, రుత్విగ్వరణం, దీక్షాకంకణధారణ, స్వస్తి పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, మండపారాధన, పంచారణార్చన, కలశార్చన, జపానుష్టాలు తదితర కార్యక్రమాలు జరుగుతాయి. ఇక సాయంత్రం సాయంకాలార్చనలు, చండీశ్వరపూజ, మండపారాధన, అంకురార్పణ, అగ్నిప్రతిష్ట, నిత్యహవనాలు జరుగుతాయి. భ్రమరాంబ అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, నవావరణార్చన, చండీహోమం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత ఏకాంత సేవ ఉంటుంది. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్దుద్దీపాలతో అలంకరించారు. రకరకాల పూజలతో తీర్చిద్దిద్దారు.