శ్రీశైలం: శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహిస్తున్నట్లు ఈవో లవన్న చెప్పారు. బుధవారం సాయంత్రం గంగాధర మండపం వద్ద 11 రకాల ప్రత్యేక పుష్పాలతో అలంకరించి రథాంగపూజ, రథాంగ హోమం, రథాంగబలిలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, అన్నం రాశిగా పోసి కుంబం సాత్విక బలి సమర్పించిన అనంతరం రథంపై స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేసి రథోత్సవం జరిపించారు.
ఆలయ ప్రధాన వీధిలో జరిగిన రథోత్సవంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. రథోత్సవం దర్శించుకోవడం వలన సర్వపాపాలు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాల్లో చెప్పబడింది.
మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం జరిపించారు. విద్యుద్దీప కాంతులనడుమ పుష్కరిణిలో తెప్పపై విహరించిన ఆది దంపతులను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల భక్తులు ఆలయానికి చేరుకున్నారు. మంగళ వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో ఆలయ రాజగోపురం నుండి పుష్కరిణికి చేరుకున్న స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచార క్రతువులు నిర్వహించి పుష్కరిణిలో మూడుసార్లు ప్రదక్షిణలు చేయించారు.
కార్యక్రమంలో ఈఈ మురళీ, అసిస్టెంట్ నటరాజ్, ఏఈవోలు ఫణీదర్ ప్రసాద్, పిఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్‌కుమార్, రెవెన్యూ అధికారి శ్రీహరి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహరెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.