Srisailam | శ్రీశైలం : శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి క్షేత్రంలో ఈ నెల 29న స్వర్ణ రథోత్సవం జరుగనున్నది. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో పెద్దిరాజు ఆలయానికి చెందిన వివిధ విభాగాల అధికారులు, ప్రధాన అర్చకులతో సమీక్ష నిర్వహించారు. స్వర్ణరథోత్సవం, సామూహిక వరలక్ష్మీవ్రతం ఏర్పాట్లు, భద్రా చర్యలతో పాటు వినాయక నవరాత్రి వేడుకల నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. 29న ఆరుద్రా నక్షత్రం సందర్భంగా స్వర్ణరథోత్సవం జరుగుతుందని.. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఉత్సవంలో కోలాటం, చెక్కభజనలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పీఆర్ఓను ఆదేశించారు. రథానికి పుష్పాలంకరణ చేయాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పారు. 30న జరుగనున్న వరలక్ష్మీ వ్రతం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రత్యేకంగా చెంచు మహిళలు పాల్గొనేందుకు వీల్పించామని చెప్పారు. ఈ మేరకు గిరిజనాభివృద్ధి సంస్థ సహాయ సహకారాలు తీసుకోవాలని సూచించారు. చెంచులతో పాటు సాధారణ భక్తులను అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. వ్రతంలో పాల్గొన్న వారికి అన్నప్రసాదం అందించనున్నట్లు తెలిపారు. వ్రతం సమయంలో తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. అలాగే, భద్రతపై ఈవో కీలక సూచనలు చేశారు. నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తున్నారని.. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
దేవాదాయ చట్టం మేరకు నిషేధిత వస్తువులు, మత్తుపానియాలు అనుమతించకుండా టోల్గేట్ వద్ద పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ మేరకు పోలీసులు సహకరించాలని సీఐకి విజ్ఞప్తి చేశారు. క్షేత్ర పరిధిలో పొగ తాగడం, మాంసాహారం, మద్యాన్ని నిషేధించామని.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోంటామని బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనాల రాకపోకల క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్, రద్దీ క్రమబద్ధీకరణ, క్యూలైన్ల నిర్వహణ, ప్రసాదాల కౌంటర్ల రద్దీ నియంత్రణకు కీలక సూచనలు చేశారు. వినాయకచవితి పర్వదినం మూడోరోజు నుంచే భక్తులు కృష్ణానదిలో వినాయక నిమజ్జనం చేసేందుకు వస్తుండడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు.