శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నలుగుర్ని పీకండి.. మీకు చేతగాకపోతే నేను మనుషుల్ని పంపిస్తానని ఆత్మకూరు విజయోత్సవ సభలో ఎమ్మెల్యే మాట్లాడిన ఓ వీడియోపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిలబడాలంటే చంపినవాళ్లతో పాటు వాళ్లను రక్షిస్తున్న వారిని కూడా జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్పందించారు. తాను మాట్లాడిన వీడియోను మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని జగన్ అంటున్నారని మండిపడ్డారు. పూర్తి వీడియోను పంపిస్తానని.. జగన్ ఆ వీడియో పూర్తిగా చూడాలని సవాలు విసిరారు.
జగన్ పాలనలో ఎంతోమంది హత్యలు చేసి.. ఆయన పక్కన కూర్చున్నారని విమర్శించారు. జగన్ తన కాల్ డేటా తీయాలని అంటున్నారని, తనతో పాటు తన అనుచరుల నంబర్లు కూడా ఇస్తానని తెలిపారు. వాళ్లందరి కాల్ డేటాను కూడా బయటకు తీయించాలని జగన్కు సవాలు విసిరారు. దీనిలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. బండి ఆత్మకూరుకు చెందిన ఓ ముస్లిం మహిళను మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అనుచరులు అత్యాచారం చేస్తే జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సీతారామపురంలో రెండు వర్గాల మధ్య శిల్పా చక్రపాణి రెడ్డినే గొడవ పెట్టారని అన్నారు. సుబ్బరాయుడు హత్యకు కారకుడు కూడా అతనే అని ఆరోపించారు. తనపై కేసు పెట్టాలని జగన్ డిమాండ్ చేస్తున్నారని.. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తనపై కేసు నమోదైతే సీఎం చంద్రబాబుకు వివరణ ఇచ్చుకుంటానని తెలిపారు.
‘‘మండలానికి ఇద్దరిని చంపండి.. ఏవైనా కేసులైతే నేను చూసుకుంటా. ఒకవేళ మీకు చేతకాకపోతే చెప్పండి నేను మనుషుల్ని పంపిస్తా’’ ఇదీ ఓ పబ్లిక్ మీటింగ్లో కార్యకర్తలను ఉద్దేశించి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటలు
ఆ హామీతో రెచ్చిపోయిన @JaiTDP గూండాలు నంద్యాలలో వైయస్… pic.twitter.com/gY643Eqyti
— YSR Congress Party (@YSRCParty) August 10, 2024
నంద్యాల జిల్లా సీతారామపురంలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడు కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ శుక్రవారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పోలీసుల సమక్షంలోనే పెద్దసుబ్బరాయుడిని చంపేశారని.. సుబ్బరాయుడి భార్య మీద కూడా దాడి చేశారని అన్నారు. పోలీసుల ఎదుటే నిందితులు ఉన్నా ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. రాజకీయ కుట్ర లేకపోతే హత్య జరిగిన తర్వాత అదనపు బలగాలను ఎందుకు రప్పించలేదని మండిపడ్డారు.
ఎవరి ప్రోద్బలంతో నిందితులకు పోలీసులు సహకరించారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. హత్య చేసిన వాళ్లు ఎవరు? చేయించిన వాళ్లుఎవరు? అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రతి చోటా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయని తెలిపారు. నిందితుల కాల్ డేటా చూస్తే ఎవరు చేయించారో తెలుస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను జగన్ మీడియా ముందు ప్రదర్శించారు.
విజయోత్సవ సభ పెట్టి మరీ.. ‘ మండలానికి ఇద్దరు వైసీపీ నాయకులను చంపండి.. నేను చూసుకుంటా అని అంటున్నాడు’ అని మండిపడ్డారు. ఎమ్మెల్యే మాట్లాడిన వీడియోను అందరికీ వినిపించిన జగన్.. స్థానిక ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టి చంపమని చెబుతుంటే ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ బతకాలంటే.. ఈ దాడులు ఆగాలంటే చంపినవాళ్లపై మాత్రమే కాదు.. చంపిన వాళ్లను రక్షిస్తున్న వారిని కూడా జైల్లో పెట్టాలని అన్నారు. అప్పుడే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిలబడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా చేయి జారకముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ అన్యాయాలపై కలిసికట్టుగా పోరాడతామని ప్రజలు, మీడియాను ఆయన కోరారు. చంపిన వాళ్లనే కాకుండా వాళ్లను చంపించిన వాళ్లకు సపోర్ట్ చేస్తున్న నారా లోకేశ్, నారా చంద్రబాబును కూడా ముద్దాయిగా చేరిస్తే తప్ప రాష్ట్రంలో లా అండ్ అర్డర్ బతకదని స్పష్టం చేశారు.