Srisailam | శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలతో పాటు పరివార దేవాలయాల్లో హుండీలను లెక్కించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు నాలుగు వారాల్లోనే రూ.6,09,05,947 నగదు హుండీ ద్వారా ఆదాయం వచ్చింది. ఈ ఆదాయాన్ని గత 27 రోజుల్లో స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. హుండీల్లో నగదుతో పాటు 200 గ్రాములకుపైగా బంగారం, 6 కేజీలకుపైగా వెండి కానుకల రూపంలో వచ్చిందని చెప్పారు. అలాగే 900 యూఎస్ డాలర్లు, 10 సింగపూర్ డాలర్లు, 15 మలేషియా రంగిట్స్, 30 ఆస్ట్రేలియా డాలర్లు, 20 యూకే పౌండ్స్, 810 యుఏఈ దిర్బమ్స్, 250 మెక్సికో పీసో, 130 కెనడా డాలర్స్తో పాటు పలుదేశాలకు చెందిన విదేశీ కరెన్సీ వచ్చినట్లు తెలిపారు.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీలను లెక్కించినట్లు అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు, డిప్యూటీ ఈవో ఆర్ రమణమ్మ, వివిధ విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, శివసేవకులు పాల్గొన్నారు. మార్చి నెలాఖరులో శ్రీశైల క్షేత్రంలో ఐదురోజుల పాటు ఉగాది ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. కర్నాటక, మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉత్సవాలకు వారం రోజుల ముందు నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.