Srisailam | కార్తీకమాసోత్సవాల సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి ఆలయంలో చేసిన ఏర్పాట్లను ఇంచార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. క్షేత్ర పరిధిలోని ఆలయ మాడవీధులు, ఆలయపుష్కరిణి, అన్నప్రసాద వితరణ, పాతాళగంగ, పార్కింగ్ ప్రదేశాలను సందర్శించి ఆయా ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇంఛార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయ ఉత్తరమాడవీధి, గంగాధర మండపం ఎదురుగా భక్తులు కార్తీక దీపాలను వెలిగించుకునేందుకు ఆయా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉండాలని సూచించారు. దీపారాధన ఏర్పాట్లను సంబంధిత విభాగాధిపతులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలన్నారు. అనంతరం పుష్కరిణి హారతి కార్యక్రమాలకు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహింపజేయాలని అధికారులకు ఇంచార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. లక్షదీపోత్సవానికి వీలుగా పుష్కరిణి పరిసరాలలో ప్రమిదలను క్రమపద్ధతిలో ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా తగినంత మేరకు లైటింగ్ ఏర్పాట్లు ఉండాలన్నారు. విద్యుద్దీపాలంకరణ కూడా ఆకర్షణీయంగా ఉండాలన్నారు.
లక్షదీపోత్సవం నిర్వహించే రోజుల్లో పుష్కరిణి వద్ద సంప్రదాయబద్దంగా పుష్పాలంకరణ చేయాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. అనంతరం పాతాళగంగ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. పాతాళగంగ పరిసరాలను, పాతాళగంగ మెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తుండాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. అదేవిధంగా ప్రమాదాలను నిరోధించేందుకు పాతాళగంగ నీటిమట్టం వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడింగులు దృఢంగా ఉండేటట్లుగా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను ఆదేశించారు. అనంతరం పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.