Srisailam | శ్రీశైలంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పాదయాత్రతో చేరుకుంటారు. శివదీక్ష భక్తులతో పాటు సాధారణ భక్తులు కూడా ఈ కాలిబాట మార్గంలో క్షేత్రానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో కాలిబాట మార్గంలోని దామెర్లకుంట – పెద్దచెరువు ప్రాంతాల్లో చేయాల్సిన ఆయా ఏర్పాట్లను ఈవో ఎం.శ్రీనివాసరావు ఆదివారం పరిశీలించారు.
ప్రధాన రహదారిలోని ఆత్మకూరు – వెంకటాపురం నుంచి భక్తులు అటవీమార్గంలో గోసాయికట్టు వీరాంజనేయస్వామి, నాగలూటి, దామెర్లకుంట, పెద్దచెరువు, మఠంబావి, భీముని కొలను, కైలాసద్వారం మీదుగా శ్రీశైలక్షేత్రాన్ని చేరుకుంటారు. ఈ కాలిబాట మార్గం సుమారు 40 కి.మీ ఉంటుంది. కాబట్టి కాలిబాట మార్గంలోని మంచినీటి సదుపాయం, భక్తులు సేద తీరేందుకు చలువ పందిర్లు ఏర్పాటు, తాత్కాలిక విద్యుద్దీకరణ, అన్నదానం చేసే భక్త బృందాలకు దేవస్థానం అందించాల్సిన సహాయ సహకారాలు, కాలిబాట మార్గంలోని ఆయా ప్రదేశాల్లో మార్గ సూచికల ఏర్పాటు, వైద్య శిబిరాల ఏర్పాటు మొదలైన వాటికి సంబంధించిన అంశాలను ఈవో ఎం.శ్రీనివాసరావు పరిశీలించారు.
Srisailam2
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. అటవీశాఖ సహకారంతో దామెర్లకుంట – పెద్దచెరువు ప్రాంతాలలో జంగిల్ క్లియరెన్స్ పనులను ( పిచ్చిమొక్కలను తొలగించే పనులను) వెంటనే చేపట్టాలని సూచించారు. దామెర్లకుంట – పెద్దచెరువు వద్ద గత ఏడాది కంటే కూడా అదనంగా చలువపందిళ్ళు వేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతాలలో ఒక్కొక్క చోట కనీసం 5 ప్రదేశాలలో ఈ చలువపందిర్లు ఉండాలన్నారు. ఒక్కొక్క పందిరిలో కనీసం వెయ్యి మందికిపైగా భక్తులు సేద తీరేవిధంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. చలువపందిళ్లలో ఫ్లోర్ మ్యాట్, సైడ్వాల్స్ ఏర్పాటు ఉండాలన్నారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేకంగా పైప్ పెండాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గతంలోలాగే జనరేటర్లను ఏర్పాటు చేసి తాత్కాలిక విద్యుద్దీకరణ ఏర్పాట్లు కూడా చేపట్టాలని చెప్పారు. అదేవిధంగా పెద్దచెరువు, దామెర్లకుంటలలో గతంలో కంటే కూడా అధిక సంఖ్యలో తాత్కాలిక శౌచాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. గత సంవత్సరం కంటే కూడా కనీసం 20 శాతం మేరకు అధిక ఏర్పాట్లు ఉండాలన్నారు. గత సంవత్సరం కంటే కూడా అధికసంఖ్యలో వాటర్ ట్యాంకర్లను పంపాలని నీటిసరఫరా విభాగాన్ని ఆదేశించారు.
Srisailam3
కాలిబాటతో వచ్చే భక్తులు ప్రధానంగా కాలిబొబ్బలు, ఒళ్లు నొప్పులు మొదలైన ఇబ్బందులతో బాధపడుతుంటారని ఈవో అన్నారు. జిల్లా వైద్యశాఖ సమన్వయంతో అటవీమార్గంలో ఏర్పాటు చేయనున్న వైద్యశిబిరాలలో ఈ సమస్యలకు సంబంధించిన పూత మందులు (ఆయింట్మెంట్) మాత్రలు మొదలైనవి అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాలని దేవస్థాన వైద్య విభాగాన్ని ఆదేశించారు. నాగలూటి, దామెర్లకుంట, పెద్దచెరువు ప్రాంతాలలో అన్నదానం చేస్తున్న భక్త బృందాలకు దేవస్థానం పక్షాన పూర్తి సహాయసహకారాలను అందించాలన్నారు. అదేవిధంగా నాగలూటిలో కూడా జంగిల్ క్లియరెన్స్, పైప్ పెండాల్స్, తాత్కాలిక విద్యుద్దీకరణ మొదలైన వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Srisailam4
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పి. మురళీ బాలకృష్ణ, ఎం. నరసింహారెడ్డి, సివిల్ అండ్ ఎలక్ట్రికల్ విభాగపు ఇంచార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు, పి.చంద్రశేఖరశాస్త్రి, పి.వి.సుబ్బారెడ్డి, సంబంధిత సహాయ ఇంజనీర్లు, రాజేశ్వరరావు, రంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.