Srisailam | శ్రీశైలం: బాహ్య వలయ రహదారి ( ఔటర్ రింగురోడ్డు) పరిసర ప్రాంతాలు, యాంపీ థియేటర్, సారంగధర మఠం తదితర ప్రదేశాలు, వాటి సరిసర ప్రాంతాలను సుందరీకరించాలని శ్రీశైలం ఈఓ డీ పెద్దిరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఔటర్ రింగ్ రోడ్డు, యాంపీ థియేటర్, సారంగధర మఠం తదితర ప్రాంతాలను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఈఓ డీ పెద్దిరాజు మాట్లాడుతూ వలయ రహదారిలోని చుట్టు పక్కల గల పిచ్చిమొక్కలను, బండ రాళ్ళను, తదితర వ్యర్థాలను తొలగించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే యాంపీ థియేటర్ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యంగా యాంపీ థియేటర్ పరిసరాలలో పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను, వ్యర్థాలను తొలగించాలని పారిశుద్ధ్యపు అధికారులను ఆదేశించారు.
సారంగధర మఠం వద్ద వర్షపు నీటితో పాటు కొట్టుకువచ్చే వ్యర్థాలు, గుండాలలో కలవకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని సంబంధిత అధికారులను ఈఓ పెద్దిరాజు ఆదేశించారు. గుండాలలో వ్యర్థాలు కలవకుండా ఉండేందుకు గుండాల చుట్టూ సిమెంట్ గట్లును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బాహ్య వలయ రహదారిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని భద్రతావిభాగాన్ని ఆదేశించారు. ఈ విషయమై స్థానిక పోలీసు శాఖ సహకారాన్ని తీసుకోవాలన్నారు. బాహ్య వలయ రహదారి డివైడర్లలో సెంట్రల్ మీడియన్స్లో పచ్చదనాన్ని మరింతగా పెంచాలని ఉద్యానవన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ వీ రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (ఐసీ) పీ చంద్రశేఖరశాస్త్రి, అసిస్టెంట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.