Srisailam | శ్రీశైల మహాక్షేత్ర పరిధిలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం, ఏపీ అటవీశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. బుధవారం (15.5.2024) నాడు స్థానిక సత్రాల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రతినిధులు, సిబ్బందితో దేవస్థానం ఈఓ డీ పెద్ది రాజు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ పెద్దిరాజు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయడానికి స్థానిక సత్రాల నిర్వాహకులు పూర్తి సహాయ, సహకారాలు అందించాలని చెప్పారు. సత్రాల్లో వసతి పొందే భక్తులకు కూడా సత్రాల యాజమాన్యాలు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అలాగే సత్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి కూడా పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు.
అన్ని సత్రాల నిర్వాహకులు కూడా విడివిడిగా రెండు చెత్తకుండీలు ఏర్పాటు చేసుకోవాలని ఈఓ పెద్దిరాజు చెప్పారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా ఆయా చెత్తకుండీల్లో వేయాలని అన్నారు. ఈ చెత్త కుండీలను దేవస్థానం పారిశుద్ధ్య సిబ్బందిడంప్ యార్డుకు తరలిస్తారన్నారు. దేవస్థానం పరిధిలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ స్పూన్లు, ప్లాస్టిక్ ఫోర్కులు, ప్లాస్టిక్ కప్పులు తదితరాల వాడకాన్ని కూడా పూర్తి నిషేధించామన్నారు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల స్థానంలో మట్టి లేదా స్టీల్ లేదా రాగి సీసాలను వినియోగించాలని చెప్పారు. ప్లాస్టిక్ క్యారీబ్యాగులకు బదులు కాగితం, జనపనార, గుడ్డ సంచులు వాడాలన్నారు. ప్లాస్టిక్ ప్లేట్ల స్థానంలో అరటాకులు, విస్తరాకులు, వక్కచెట్ల బెరడుతో చేసిన ప్లేట్లు వాడవచ్చునన్నారు.
భక్తుల సౌకర్యార్థం దేవస్థానం పలుచోట్ల మొత్తం 30కి పైగా ఉచిత వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసిందని ఈఓ డీ పెద్దిరాజు చెప్పారు. ఇప్పటికే ఈ విషయమై దేవస్థాన ప్రసార వ్యవస్థ ద్వారా, క్షేత్ర పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బోర్డుల ద్వారా స్థానికుల్లో, భక్తుల్లో అవగాహన కల్పించామన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలను ఎంతో సవివరంగా తెలిపారు. పర్యావరణాన్ని తీవ్రంగా కలుషితం చేసే వాటిల్లో ప్లాస్టిక్ వాడకం ఒకటని చెప్పారు. ప్లాస్టిక్ నీటి సీసాలు, ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ పళ్లాలు తదితరాలు విచ్చలవిడిగా వాడి పడేయడం వల్ల అవి నేల, నీటి కాలుష్యానికి కారణం అవుతున్నాయని చెప్పారు. భూమిలో కలిసిపోని ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు, భూగర్భ జలాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు.
మిగిలిపోయిన ఆహారం, ఇతర వ్యర్థ పదార్థాలతో కలిసిపోయిన ప్లాస్టిక్ సంచులను జంతువులు తినడం వల్ల అవి జబ్బుల బారీన పడతాయని, ఒక్కోసారి అకాల మరణం పొందుతాయని ఈఓ డీ పెద్దిరాజు చెప్పారు. వాడిన ప్లాస్టిక్ వస్తువులను సరిగ్గా పారవేయక పోవడంతో అవి మురుగునీటి వ్యవస్థలో పడి మురుగునీటి ప్రవాహానికి అడ్డంకిగా మారతాయని అన్నారు. దీంతో అపరిశుభ్రత వాతావరణం ఏర్పడి, రోగ కారకమైన సూక్ష్మ క్రిములు ప్రబలుతాయన్నారు. ప్లాస్టిక్ పునర్వినియోగ సమయంలో ఉత్పత్తయ్యే విషపూరిత ఆవిరి తీవ్రమైన కాలుష్యాన్ని కలిగిస్తుందన్నారు.
అందుకే పర్యావరణ పరిరక్షణకు, వన్యప్రాణుల సంరక్షణ కోసం దేవస్థాన పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని ఈఓ డీ పెద్ది రాజు చెప్పారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, దేవస్థానం మధ్య పలు సమావేశాలు కూడా జరిగాయన్నారు. గతేడాది నవంబర్ లోనే స్థానిక వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులకు ప్లాస్టిక్ వాడక నిషేధంపై దేవస్థానం పరిపాలనా భవనంలో అవగాహన సమావేశం నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో ప్లాస్టిక్ వాడకంతో అనర్ధాలు, ప్లాస్టిక్ స్థానంలో వాడాల్సిన ప్రత్యామ్నాయాలపై అవగాహన కల్పించామన్నారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వీ రామకఈష్ణ, పారిశుద్ధ్య – రెవెన్యూ సహాయ కార్య నిర్వహణాధికారి బీ మల్లిఖార్జున రెడ్డి, పీఆర్ఓ టీ శ్రీనివాసరావు, భద్రతా విభాగం పర్యవేక్షకులు అయ్యన్న, రెవెన్యూ విభాగం పర్యవేక్షకులు శివ ప్రసాద్, సహాయ పీఆర్ఓ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.