Srisailam | ఈ నెల 10న నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవంతో పాటు పుష్పార్చన ఏర్పాట్లపై శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. లోక కల్యాణం కోసం జరిపే ఉత్సవం, పుష్పార్చన ఆయా కైంకర్యాలన్నీ స్వామిఅమ్మవార్లకు పరిపూర్ణంగా జరిపించాలని వైదిక సిబ్బందికి సూచించారు. పూజలను సంబంధించిన సమయ పాలన పాటించాలని ఆదేశించారు. ఉదయం జరుగనున్న స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవానికి జరిపే ఏర్పాట్లు ఎలాంటి లోటులేకుండా ఉండాలని ఆలయ, ఇంజినీరింగ్, భద్రతా విభాగాలను ఆదేశించారు. భక్తులు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని క్యూ కాంప్లెక్స్ విభాగాన్ని ఆదేశించారు.
ముఖ్యంగా సమయానుసారంగా క్యూలైన్లలో మంచినీరు, అల్పాహారాన్ని అందించాలన్నారు. ఆలయం, క్యూ కాంప్లెక్సు విభాగాలు పరస్పర సమన్వయంతో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సూచించారు. అదేవిధంగా పుష్పార్చనకు సంబంధించి అక్కమహాదేవి అలంకార మండపంలో అవసరమైన వేదిక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పుష్పార్చన శ్రీశైలటీవి, దేవస్థానం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలను చేయాలని శ్రీశైల టీవి విభాగాన్ని ఆదేశించారు. పుష్పార్చనను భక్తులు వీక్షించేందుకు అక్కమహాదేవి అలంకార మండపంలో ఎల్ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో వైదిక కమిటీ, ఇంజినీరింగ్, ఆలయం, భద్రత, క్యూ కాంప్లెక్స్, వసతి విభాగాధికారులు పాల్గొన్నారు.