Srisailam | ధర్మప్రచారంలో భాగంగా శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణ శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఆలయ ఉత్తర ద్వారం ఎదురుగా గల చంద్రావతి కల్యాణ మండపంలో ఈ వ్రతాలు ఏర్పాటు చేశారు. ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకున్న వారితోపాటు దేవస్థానం కార్యాలయంలో స్థానికంగా నమోదు చేసుకున్న మొత్తం 1500 మందికి పైగా భక్తులు ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొన్నారు. స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ వ్రతంలో పాల్గొన్నారు. ఈ వ్రతాలకు కావాల్సిన పూజా ద్రవ్యాలన్నీ దేవస్థానమే సమకూర్చింది. వ్రతంలో పాల్గొనే ప్రతి ఒక భక్తురాలికి వేర్వేరుగా కళశాలు ఏర్పాటు చేసిన శాస్త్రోక్తంగా వ్రతం జరిపించారు. సంప్రదాయ బద్ధంగా సాగిన ఈ వ్రతంలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ నిర్వహించారు. తర్వాత వేదికపై వేంచెబు చేయించిన శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపించారు.
వరలక్ష్మి వ్రతంలో భాగంగా భక్తులందరి చేత విడివిడిగా కలశ స్థాపన చేయించి వరలక్ష్మి దేవి వారిని సమంత్రకంగా ఆవాహన చేశారు. తర్వాత శ్రీసూక్త విధానంలో వ్రతకల్ప పూర్వకంగా వరలక్ష్మి దేవి వారికి షోడశోపచార పూజలు జరిపించారు. అనంతరం ఆలయ అర్చలకు వ్రతకథ పఠించి వ్రత మహిమావిశేషాలను భక్తులకు తెలిపారు. చివరిగా నీరాజన మంత్ర పుష్పాలు జరిపి వ్రత సమాప్తి చేశారు.
వరలక్ష్మి వ్రతం జరిపించుకున్న వారందరికీ చీర, రవిక వస్త్రం, పూలు, గాజులు, కంకణాలు, తులసిమొక్క, శ్రీశైల ప్రభ మాస పత్రిక, మూడు రకాల ప్రసాదాలు అందజేశారు. భక్తులకు తొలిసారిగా శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో చీర, తులసి మొక్క అందజేయడం విశేషం. వ్రతం అనంతరం భక్తులందరికీ ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. దర్శనానంతరం దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భక్తులందరికీ అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఈఓ డీ పెద్దిరాజు దంపతులు, డిప్యూటీ ఈఓ ఆర్ రవణమ్మ, ఆలయ సహాయ కార్య నిర్వహణాధికారి ఎం హరిదాసు, అద్యాపకులు ఎం పూర్ణానందం, పలువురు అర్చక స్వాములు, వేద పండితులు, పలు విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం ఈఓ పెద్దిరాజు మాట్లాడుతూ మన వైదిక సంప్రదాయంలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించడం సంప్రదాయంగా వస్తున్నదని అన్నారు. శ్రావణ మాసం సర్వదేవతా ప్రీతికరం అని చెప్పారు. ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగానే దేవస్థానం ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం ఎంతో హర్షణీయం అని అన్నారు.
అర్చక స్వాములు మాట్లాడుతూ జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామి, మహాశక్తి స్వరూపిణి భ్రమరాంబికా దేవి స్వయంవక్తంగా వెలిసిన శ్రీశైల మహాక్షేత్రంలో వరలక్ష్మి వ్రతం జరిపించుకునే వారంతా ఎంతో అదృష్టవంతులన్నారు. అందరికీ శ్రేయస్సు కలుగుతుందన్నారు. భక్తులంతా వ్రత ప్రక్రియ సౌకర్యవంతంగా వీక్షించడానికి వీలుగా తొలిసారి ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. చంద్రావతి కల్యాణ మండపంలో మొత్తం ఐదు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.